ఇన్ఫ్రాస్ట్రక్చర్.
హోల్ మొత్తం మీద అత్యంత ప్రమాదకరమైన పదం.
ఇది తలకెక్కితే చాలు.
ఎక్కడా లేని అందమైన కలలు కంటాం.
అత్యద్భుతమైన సిమెంటు, ఉక్కు సామ్రాజ్యాలు నిర్మిస్తాం.
వాటికి జీవం పోసే "సగటు మనిషి"కి ఎంట్రెన్స్ మరచిపోతాం.
నగరంలో ఒక్కశాతం జనం కూడా
వచ్చే పదేళ్ళలో ఎక్కలేని విమానం కోసం
వామనుడికిచ్చినట్లు భూమి దానమిచ్చేస్తాం.
భావితరం పౌరులు ఇరుకు బడుల్లో చదివేందుకు
రోడ్డుదాటే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు
మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలల్లో రావెందుకో?
ఇన్ఫ్రాస్ట్రక్చర్ జూదంలో పేదవాడి భూమి ధరకూ రెక్కలొస్తాయి.
తల్లిలా సాకిన మట్టి తాచుపామవుతుంది.
తేగనమ్ముకొని పారిపోకుంటే కాటు వేస్తుంది.
అక్కడ బతకలేమని తెలిసీ కన్నీళ్ళెందుకు వెర్రి కన్నా?
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక వ్యసనం.
పచ్చటి మైదానాల్లో మట్టి రోడ్లు తారవుతాయి.
నదులు నిలిచిపోతాయి.
వేల సంవత్సరాలుగా లేకపోయినా
మనిషి హాయిగా బతికిన కరెంటు
ఆక్సిజన్ అవుతుంది.
శాశ్వతత్వం చివరి గురుతులు...
కొండలూ పగిలి పుండు పడతాయు.
రేవులో సరుకుల పరుగులూ
నా ప్రయోజనానికేనా?
ఓట్లేసే జనం దూరమైనా కొనిపెట్టే నోట్ల ధీమా!
వసుధైక కుటుంబం
వ్యాపారంతో సాధిస్తున్నామని
ఏసీ కాన్ఫరెన్సుల్లో ఇంగ్లిష్ కూతలు.
డబ్బే పరమార్థంగా చంటిబిడ్డనూ
పరుగులెత్తించే సంస్కృతి ప్రభోధలు.
"స్థాపించిన సామ్రాజ్యాలూ, నిర్మించిన కృత్రిమ చట్టాల్"
ఎక్కడో విన్న మాటలు కావు.
మన కళ్ళ ముందే నిజమౌతాయ్.
జనం కన్నెర్రజేయకున్నా...
ప్రకృతి చాలు ఈ పేక మేడలు కూల్చేందుకు.
ఆదాము, అవ్వల ఆనందం అవనిపై పునరుద్ధరించేందుకు.
No comments:
Post a Comment