Sunday, August 26, 2007

జై మధ్యంతరం జై తెలంగాణా

తెలంగాణాకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానంలో కదలిక మొదలైంది. తెలంగాణా వాదులు ఈ విషయంలో ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్న వామపక్షాలకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అణు వివాదంలో యు.పి.ఎ. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తామని హెచ్చరికలు పంపడం వల్లే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో తన బలాన్ని పదిలం చేసుకోవాలనే స్పౄహలోకి వచ్చింది. అందులో భాగంగానే తెరాస ఎంపీలను తన ఒడిలోకి తెచ్చుకొనే ప్రయత్నం చేస్తోంది. ఈమేరకు పి.సి.సి. అధ్యక్షుడు కె.కేశవరావు ముగ్గురు తెరాస ఎం.పి.లతో బుధవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెరాస ఎం.పి.లను కాంగ్రెస్ లో చేరాలని సూచించారు. సమావేశానికి తెరాస అధినేత కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయి. నరేంద్ర ఇప్పటికే కాంగ్రెస్ ప్రతిపాదనకు ఓకే చెప్పేశారని సమాచారం. తెలంగాణా సాధించకుండా కాంగ్రెస్ ప్రతిపాదనకు ఓకే చెప్పె ప్రసక్తి లేదని తెరాస ఎం.పి.లు స్పష్టం చేశారు. అందుకు కేకే ఒక రాజీ ఫార్ములా సూచించారు. దాని ప్రకారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మరో తీర్మానం చేస్తుంది. రెండో ఎస్.ఆర్.సి.కి బదులు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ రీఆర్గనైగేషన్ కమిషన్ వేయాలని ప్రభుత్వాన్ని కోరుతుంది.(ప్రభుత్వం వేసినప్పుడు సంగతి.) ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిస్థితుల నేపధ్యంలో ఈ సిఫార్సు చేసినట్లు చెబుతారు. లెఫ్ట్ హ్యాండిస్తే మధ్యంతర ఎన్నికల కోసం ఈ ఏర్పాటు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ యూపీయేలో పెద్ద పార్టీగా పెత్తనం చేయడానికి ఆంధ్రాలో వచ్చిన మెజారిటీయే కారణం. ఈ నేపధ్యంలో అదే సంఖ్యలో సీట్లతో ప్రస్తుత మధ్యంతరం గట్టెక్కితే చాలు. తెలంగాణా ఇచ్చే సంగతి వచ్చే ప్రభుత్వం చూసుకుంటుంది. సేం స్టోరీ. ఈ ప్రతిపాదన నచ్చితే తెరాసా కాంగ్రెస్ లో చేరొచ్చు. ఐడెంటిటీ ఉండాలనుకుంటే కాంగ్రెస్ తో పొత్తుతో సొంత కుంపటి కంటిన్యూ చేయవచ్చు. ఈ ఫార్ములాపై ప్రస్తుతం తెరాస మల్లగుల్లాలు పడుతోంది.

Saturday, August 18, 2007

సెంటిమెంట్ భయం!

శనివారం ప్రెస్ మీట్లో కేంద్ర మంత్రి జైరాంరమేశ్ మాటలు చూస్తుంటే కాంగ్రెస్ అధిష్టానానికి అభివృధ్ది కార్డు మీద గెలుస్తామన్న ఆశలు లేనట్లు కనిపిస్తోంది.ఎంత అభివృధ్ది చేసినా తెలంగాణ సెంటిమెంట్ పట్టించుకోక పోతే ఎదురు దెబ్బ తప్పదని భయపడుతోంది.కేంద్రం తెలంగాణా అంశంను పట్టించుకుంటుందని మంత్రి వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ఒక్క కాంగ్రెస్ దే కాదని స్పష్టం చేశాడు.

Thursday, August 02, 2007

ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారు?

ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి వాలకం చూస్తుంటే అంబికా సోనీ దగ్గర గట్టి క్లాసే పడ్డట్లుంది. ఆందుకే గురువారం ప్రెస్ మీట్ లో వామపక్షాలను ఒక్కమాట అనలేదు. వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనులను వేగవంతం చేసేందుకే రోడ్ల మీద పడుతున్నారట. ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారు?

Wednesday, August 01, 2007

డప్పేసి చెప్తుండ

నీ సంపాదన్ల భాగమడగలే
ఇడుపుల పాయల సోటడగలే
నీ కంచంల బువ్వడగలే
నీ యాపారంలో వాట సుత అడగలే
ఈ అఖండ ధరణిపైన ఇంత సోటియ్యన్నం
ఇంతనీడియ్యన్నం....
ఆర్నీ సిర్సున దీపంబెట్ట..!
వడగండ్లు వడ్డట్లు తుపాకీ గుండ్లు దింపితివి
మా పానాలకు గండ్లు గొడ్తివి...
మెత్తటి నీళ్ళు గట్ట్లు తెగ్గోస్తయంట...!
మట్టి మనుషులను అట్లనే మంట్లగల్పితివి
దినాం ధర్మం పలికే ఓ హంసా...
పెండ సెలీరాన్ని సుఖపెట్టనీకి ఎందుకింత హింస.
మాయల ఫకీరు పాణం
రామసిలుకలున్నట్లు
నీ పాణం గూడ ఓట్ల పెట్టెలుంది
దీనికి సిలుంపడ్తది యాదుంచుకో..!
ఇగో... ఇంటుండవా...
ఏవన్నంటె సెవుల చెప్పుండ్రీ.. అంటవు.
డప్పేసి...దర్వేసి సెపుతుండ ఇను...
సూది మొనంత సోటుగూడ ఇయ్యనన్నడు
ధుర్యోధనుడు
ఎయ్యెళ్ళ కింద...ఏమైంది...
నీకు దగ్గిటోడో... దూరవోడో...
ఇసునూరోడు ఏమైండు..?
గంతెసూడు...
ఈ భూమికి ఆకర్షణ శక్తున్నట్లే
దీన్ని నమ్ముకున్నోనికి-దానిపైనా హక్కుంటుంది.
--రచయిత: గొర్ల బుచ్చయ్య, కొత్త ఢిల్లీ.