Wednesday, August 01, 2007

డప్పేసి చెప్తుండ

నీ సంపాదన్ల భాగమడగలే
ఇడుపుల పాయల సోటడగలే
నీ కంచంల బువ్వడగలే
నీ యాపారంలో వాట సుత అడగలే
ఈ అఖండ ధరణిపైన ఇంత సోటియ్యన్నం
ఇంతనీడియ్యన్నం....
ఆర్నీ సిర్సున దీపంబెట్ట..!
వడగండ్లు వడ్డట్లు తుపాకీ గుండ్లు దింపితివి
మా పానాలకు గండ్లు గొడ్తివి...
మెత్తటి నీళ్ళు గట్ట్లు తెగ్గోస్తయంట...!
మట్టి మనుషులను అట్లనే మంట్లగల్పితివి
దినాం ధర్మం పలికే ఓ హంసా...
పెండ సెలీరాన్ని సుఖపెట్టనీకి ఎందుకింత హింస.
మాయల ఫకీరు పాణం
రామసిలుకలున్నట్లు
నీ పాణం గూడ ఓట్ల పెట్టెలుంది
దీనికి సిలుంపడ్తది యాదుంచుకో..!
ఇగో... ఇంటుండవా...
ఏవన్నంటె సెవుల చెప్పుండ్రీ.. అంటవు.
డప్పేసి...దర్వేసి సెపుతుండ ఇను...
సూది మొనంత సోటుగూడ ఇయ్యనన్నడు
ధుర్యోధనుడు
ఎయ్యెళ్ళ కింద...ఏమైంది...
నీకు దగ్గిటోడో... దూరవోడో...
ఇసునూరోడు ఏమైండు..?
గంతెసూడు...
ఈ భూమికి ఆకర్షణ శక్తున్నట్లే
దీన్ని నమ్ముకున్నోనికి-దానిపైనా హక్కుంటుంది.
--రచయిత: గొర్ల బుచ్చయ్య, కొత్త ఢిల్లీ.

No comments: